- భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు, భద్రాద్రి జిల్లాలో మరో ఇద్దరు
మొగుళ్లపల్లి (టేకుమట్ల), వెలుగు : వాగులో స్నానం చేసేందుకు దిగి ఒకరు నీటిలో మునిగిపోగా, అతడిని కాపాడేందుకు వెళ్లిన మరొకరు సైతం నీటిలో మునిగి పోవడంతో ఇద్దరూ చనిపోయారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో ఆదివారం జరిగింది. మండలంలోని వెల్లంపల్లికి చెందిన సొల్లేటి రాములు (42) జీపీ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం తన కుటుంబ సభ్యులతో పాటు అదే గ్రామానికి చెందిన గీస హరీశ్ (28) తో కలిసి టేకుమట్ల శివారులోని చలివాగు వద్దకు వచ్చారు. హరీశ్ వాగులోకి దిగి ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. గమనించిన రాములు అతడిని కాపాడేందుకు నీటిలో దిగగా అతడు కూడా గల్లంతయ్యారు. కుటుంబ సభ్యులు స్థానికులకు విషయం చెప్పడంతో వారు రెండు గంటల పాటు గాలించగా ఇద్దరు డెడ్‌బాడీలు దొరికాయి. రాములు భార్య లత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాలిపేరులో మునిగి...
భద్రాచలం, వెలుగు : బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు వెళ్లి ఇద్దరు యువకులు నీటిలో పడి చనిపోయారు. భద్రాద్రి జిల్లా చర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన పాయం మహేందర్ (17), గట్టుపల్లి జంపన్న(20)లు శనివారం మహిళలతో కలిసి బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు తేగడ గ్రామంలో తాలిపేరు కాల్వ వద్దకు వెళ్లారు. నిమజ్జనం కోసం ఇద్దరు యువకులు కాల్వలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు నాటు పడవ కాల్వలోకి దిగి గాలించి ఇద్దరిని బయటకు తీసుకొచ్చారు. కానీ అప్పటికే ఇద్దరూ చనిపోయారు.